భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ పై ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు అతనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా నరేష్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. హిందూ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అతన్ని కఠినంగా శిక్షించాలన్నారు. అయ్యప్ప మాలధారణ అత్యంత పవిత్రమైనదని.. గత 25 సంవత్సరాలుగా తాను మాల వేసుకుంటున్నానని చెప్పారు.
అయ్యప్ప స్వామిని, మాల వేసుకునే స్వాములను కించపరచడం దారుణమన్నారు కృష్ణారావు. నరేష్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడాడని మండిపడ్డారు. ఎవరూ కూడా ఏ మతాన్ని, కులాన్ని ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. బైరి నరేష్ పై త్వరలోనే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు కృష్ణారావు.
ఇప్పటికే నరేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కించపరిచినా ఎవరూ ఏమనరనే పరిస్థితి వచ్చిందన్నారు. అసలైన హిందువునంటూ చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఎలా వ్యవహరిస్తారో చూడాలని చెప్పారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి రాష్ట్ర సర్కార్ మద్దతిస్తోందని ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్.