ప్రస్తుతం సెలబ్రిటీల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. ప్రముఖులంతా వరుసపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మొన్నటికిమొన్న హీరోయిన్ నయనతార విఘ్నేష్ ను వివాహమాడింది. అంతకంటే ముందు కత్రినాకైఫ్ తో పాటు చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ మధుశాలిని కూడా చేరిపోయింది.
కొన్నాళ్లుగా కోలీవుడ్ నటుడు గోకుల్ ఆనంద్ తో డేటింగ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఆ బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ తారలు, టెలివిజన్ ఆర్టిస్టులు ఈ పెళ్లికి హాజరయ్యారు.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తానని మధుశాలిని ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఎక్కువగా వర్క్ చేస్తానని ప్రకటించింది. ఆమె నటించిన 9-అవర్స్ వెబ్ సిరీస్ తాజాగా రిలీజైంది.
టాలీవుడ్ లో చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తోంది మధుశాలిని. 2005లో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. కితకితలు, వాడు-వీడు, డిపార్ట్ మెంట్, గోపాలగోపాల, గూఢచారి చీకటి రాజ్యం లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఈ క్రమంలో ఓటీటీ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు పెళ్లితో జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది.