తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ ను నియమించడంపై రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందించారు. రాష్ట్రానికి కొత్త ఇంచార్జ్‌ను నియమించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇంఛార్జ్ అనే వారు అందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్నారు.
కానీ మాణిక్కం ఠాగూర్ ఆ విషయాన్ని విస్మరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంచార్జి అంటే సూపర్ పవర్ మ్యాన్ అని ఠాగూర్ అనుకుంటున్నారన్నారు. ఇంచార్జి అయ్యాక ఠాగూర్ మారిపోయారని చెప్పారు. ఎవరిని మార్చాలని తాము కోరలేదన్నారు.
దిగ్విజయ్ సింగ్ సూచనల మేరకే ఇంచార్జ్‌ను మార్చారని పేర్కొన్నారు. ఎవరూ మరొకరి పదవి కోరుకోవడం లేదన్నారు. అది పీసీసీ అయినా లేదా మరేదైనా పదవి వచ్చిన వాళ్ళు అణుకువగా ఉండాలన్నారు. తాము ఎవరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదన్నారు. పార్టీ బాగుకోసమే సమావేశం పెట్టామన్నారు.
సీనియర్లు, జూనియర్లు అనేది ఏం లేదన్నారు. బచ్చాగాళ్లతో తాము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కి మంచి రోజులు రావాలని ఆయన కోరుకున్నారు. వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తేనే దేశంలో ప్రజలు బాగుంటారని పేర్కొన్నారు. తెలంగాణ పదాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నిషేధించారన్నారు.
ఇప్పుడు కేసీఆర్ కూడా పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా చేశారని అన్నారు. దేశం కోసమే అయితే మరి తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావని ఆయన ప్రశ్నించారు. కొత్త ఇంచార్జి వచ్చాకా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాంటి కార్యాచరణ చేస్తే బావుంటుందన్నారు.