వరంగల్ రైతు డిక్లరేషన్ ను ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. ప్రస్తుతం అందులోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోందని.. జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ లు పెట్టి రైతు డిక్లరేషన్ గురించి వివరించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్ ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు మధుయాష్కీ. ఆ సభ చూసి టీఆర్ఎస్ నేతలకు కూడా వణుకు మొదలైందని అన్నారు. వరంగల్ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టి లేపిందని.. విగ్గుగాళ్ళకు, పెగ్గుగాళ్ళకు రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడే స్థాయి లేదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటేనే మోసం, దగా అని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చుతుంటుందని ఆరోపించారు మధుయాష్కీ. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. రైతాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ని తీసుకుందని తెలిపారు. నిరుద్యోగులు, ఆదివాసీలు, మైనారిటీలని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యేలకి బంగ్లాలు, వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చాయని టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు మధుయాష్కీ. అలాగే టీఆర్ఎస్ పార్టీకి 884 కోట్ల రూపాయల ఫండ్ ఎలా వచ్చిందని నిలదీశారు. రాహుల్ గాంధీ వచ్చిన తరువాత తెలంగాణ మేలుకుందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆర్ఎస్ నేతలు మొహంజా మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకుంటూ బతికేవారని సెటైర్లు వేశారు.