కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రబెల్లిలో కిసాన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో పాటు.. పలువురు నేతలను, కార్యకర్తలను గృహనిర్బంధంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ.. నిరసన తెలిపే హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సీఎం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాటయోధులు, కవులు, కళాకారులు, మేధావులు తప్పక స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలను పోలీసుల ఇనుపకంచెలు ఆపలేవన్నారు. ఉక్కు పాదాలకింద భావవ్యక్తీకరణను ఆపే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు అంతే ధాటిగా వాటిని బద్దలు కొడతాయని హెచ్చరించారు.
చరిత్రలో వరి పండించొద్దని పిలుపునిచ్చిన చేతగాని ముఖ్యమంత్రి… వరి వేస్తే.. ఉరేనని ప్రకటించిన చౌకబారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉందని… రైతుల కోసం పోరాటాలు… ఉద్యమాలు చేసేందుకు యావత్ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందని… రైతులెవరూ అధైర్య పడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు మధు యాష్కీ గౌడ్.