దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడంతో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ.. సంపదను సృష్టిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాలు ఆస్తులు అమ్ముకుంటున్నాయని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే లక్ష్యంగా.. బ్రిటీష్ బానిస సంకెళ్లనే బద్దలు కొట్టడమే ధ్యేయంగా 1885 డిసెంబర్ 28న ముంబైలోని తేజ్ పాల్ సంస్కృత కళాశాల గోకుల్ దాస్ భవనంలో కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకుంది. గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు ఉరికించారు. క్విట్ ఇండియా.. డూ ఆర్ డై నినాదాలతో బ్రిటీష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి దేశ సరిహద్దుల ఆవలి వరకూ తరిమితరిమి కొట్టారు” అని మదు యాష్కీ అన్నారు.
స్వాతంత్ర్యానంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి సువ్యవస్థితమైన భారత గణతంత్ర రాజ్యంగా మార్చడంలో కాంగ్రెస్ ప్రధానులు, నాటి నాయకులు ముందుచూపు ఎనలేనిదని గుర్తు చేసుకున్నారు. బ్రిటీష్ పాలకుల దోపిడీతో చితికిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేయాలన్న సంకల్పంతో ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులు, ఉద్యోగ కల్పనలకు ఊతమిచ్చే భారీ, మౌలిక పరిశ్రమల ఏర్పాటు, బతుక్కి భరోసా ఇచ్చే లైఫ్ ఇన్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, వైద్యరంగం అభివృద్దికి ఎయిమ్స్, సాంకేతిక విద్యకోసం ఐఐటీలు, వృత్తి విద్యల కోసం ఐఐఎం, అంతరిక్షం అంతు చూసేందుకు ఇస్రో.. ప్రజలకు అన్నం పెట్టుందుకోసం గ్రీన్ రెవల్యూషన్.. ఎన్నింటినో తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది కాంగ్రెస్ పాలకుల దార్శనిక ఆలోచనలే అని గర్వంగా చెప్పారు.
తాత్కాలిక అవసరాల కోసం నేటి కేంద్ర ప్రభుత్వాలు అమ్ముకుంటున్న సంస్థలు, వ్యవస్థలు, పరిశ్రమలు.. అన్నీ దేశం కోసం, సమాజ హితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే అన్నది జగద్వితమే అని అన్నారు. ప్రతి ప్రాంతం, ప్రతి రాష్ట్రం, ప్రతి భారతీయుడు బాగుండాలని తపించిన కాంగ్రెస్ పాలకులు అందుకు అనుగణంగానే చర్యలు చేపట్టారని కొనియాడారు. మతాలు, భాషలు, ప్రాంతాలు అన్న వ్యత్యాసాన్ని పక్కన పెట్టి వసుధైక కుటుంబ భావాన్ని ప్రజల్లో నింపి.. సర్వశ్రేయోదేశాన్ని నెలకొల్పిందని ముధుయాష్కీ చెప్పుకొచ్చారు. వెనుకబాటుతనం ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేసుకున్నారు.
“నాటి యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి సోనియాగాంధీగారు.. తెలంగాణ ప్రజలు కూడా దేశ అభివృద్ధిలో భాగం కావాలని, ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు లభించాలని, ఇక్కడి సంపద ఇక్కడివారికి సమానంగా పంచబడాలన్న ఆలోచనతో ఇచ్చారు. తెలంగాణలోని దళిత, బడుగు, బలహీన, బహుజన, అణగారిన వర్గాల ప్రజలతో పాటు.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో సోనియమ్మ తెలంగాణను ఇచ్చారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక.. సంపదను, వనరులను, రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటున్నాడు. ఉద్యోగాలు కావాలని బిడ్డలు బలిదానాలు చేసుకుంటుంటే.. తన కుటుంబంలోని వారికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు ఇండ్లు లేక ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుంటే.. కేసీఆర్ మాత్రం.. తనకో ఫామ్ హౌస్, ఆయన కొడుక్కో ఫామ్ హౌస్, కూతురు, అల్లుడు, షడ్డకుడి కొడుకు ఉండేందుకు రాజభవనాలు నిర్మించుకున్నాడు. రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న ఈ కుటుంబానికి బుద్ధి చెప్పేందుకు మనం ముందుకు కదులుదాం.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున ప్రతిజ్ఞ పడదాం” అని ముధు యాష్కీ పిలుపు నిచ్చారు.