బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో మాధురి దీక్షిత్ ఒకరు. వరుసగా స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసి 1990లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 1998లో డా. శ్రీరామ్ నేనే ని వివాహం చేసుకుని.. యూఎస్ (US)లో సెటిల్ అయ్యింది. చాలా సంవత్సరాలు అక్కడే ఉన్న ఈ నటి ఇటీవలే ఇండియా తిరిగొచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ తరుణంలో డా. శ్రీరామ్ నేనే యూట్యూబ్ ఛానెల్‌లో మాధురి మాట్లాడుతూ.. ‘శ్రీరామ్‌తో పెళ్లి కష్టమేనని అనుకున్నా. ఎందుకంటే.. ఆయనకి పగలు, రాత్రి తేడా లేకుండా రోగుల దగ్గర పని ఉండేది. దాని వల్ల ఇంటికి సంబంధించిన అన్ని పనులు, పిల్లలను స్కూల్ తీసుకెళ్లడం, తీసుకురావడం అన్ని ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చేది.
ముఖ్యమైన సమయంలోనూ ఆయన బిజీగా ఉండేవారు. అలాంటప్పుడూ నేను అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏంటని భయం వేసేది. అంతేకాకుండా.. కొన్నిసార్లు ఇద్దరం మాట్లాడుకోవడం కూడా కుదిరేది కాదు. ఆ సమయంలో ఆయన రోగులకి చికిత్స చేస్తూ ఉండేవారు. ఆ రోగుల ప్రాణాలను నా భర్త కాపాడుతున్నాడని తెలిసినప్పుడు కొంచెం గర్వంగా అనిపించేది.
ఆయన చాలా మంచి వ్యక్తి. అందుకే మా ఇద్దరి మధ్య చాలా అనురాగం, ఆప్యాయత ఉండేవి. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. కొన్నిసార్లు కష్టంగా అనిపించినప్పటికీ.. మా పెళ్లి మా జీవితంలో ఓ మంచి జర్నీగా మిగిలిపోతుంది. అయితే, వివాహం చేసుకునే ముందు మీ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’ అని చెప్పుకొచ్చింది.