మధ్యప్రదేశ్‌లో చేతి పంపు నుంచి కల్తీ మద్యం బయటకు వస్తోంది. హ్యాండిల్‌ను కొట్టగానే పంపులో నుంచి కల్తీ మద్యం ఉబికి బయటకు వస్తోంది. కల్తీ మద్యంపై దాడులు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారులు ఈ పంపును చూసి అవాక్కై పోయారు.
వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌లోని గుణ పోలీసులు పలు గ్రామాల్లో కల్తీ మద్యంపై దాడులు చేశారు. దాడుల్లో భాగంగా దూరంగా ఉన్న రెండు గ్రామాలకు వెళ్లారు. అక్కడ పడావు పడ్డ పొలాల మద్య ఓ చేతి పంపు కనిపించింది. దీంతో అనుమానం వచ్చి చేతి పంపును కొట్టి చూశారు.
దీంతో పంపు నుంచి మద్యం బయటకు రావడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు. చేతి పంపును కొట్టి కల్తీ మద్యాన్ని బ్యారెల్స్ లో నింపి ధ్వంసం చేశారు. ఆ చేతి పంపు ఉన్న ప్రాంతంలో సుమారు 7 ఫీట్ల లోతులో పెద్ద ట్యాంకర్‌ను మద్యం మాఫియా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి చుట్టు పక్కల గ్రామాలకు కల్తీ మద్యంను మాఫియా సరఫరా చేస్తోంది.
గుణ పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో కల్తీ మద్యంను పోలీసులు ధ్వంసం చేశారు.
పోలీసుల రాక గమనించిన నిందితులు పరారయ్యారు. మొత్తం 8 మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.