ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది మరో ఉదాహరణ. ప్రసవం కోసం తన కూతురును ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఓ ఎమ్మెల్యే ఏకంగా 12 గంటలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. విజయాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ తన కూతురు డెలీవరీ కోసం షియోపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు ప్రసవం చేయకుండా ఆలస్యం చేశారు. సాధారణ డెలివరీ సాధ్యం కాదని సిజేరియన్ చేయాలని ముందు చెప్పారు… ఆ తర్వాత ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని చెప్పడంతో 12 గంటలు ఎదురు చూడాల్సి వచ్చింది..అయినా డాక్టర్లు రాకపోగా.. ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అంటూ అక్కడి సిబ్బంది ఆలస్యంగా చెప్పారు. చివరికి ఆ ఎమ్మెల్యే 119 కిలోమీటర్ల దూరం ఉన్న శివపురిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్యేతో పాటు అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన విమర్శలకు దారి తీసింది.