మధ్యపద్రేశ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల తన కొడుకు మృత దేహాన్ని ఇంటికి తరలించేందుకు వాహనం దొరక్క ఓ తండ్రి ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో తన తమ్ముడి శవాన్ని తన కాళ్లపై పెట్టుకుని తండ్రి వచ్చే వరకు ఎదురు చూశాడు అతని సోదరుడు.
ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టించాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆస్పత్రి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఘటన వివరాల్లోకి వెళితే… అంబా జిల్లాలోని బాద్రా గ్రామానికి చెందిన పూజారాం జాదవ్ కుమారుడు(2) రక్తహీనతతో బాధపడుతున్నాడు. దీంతో కుమారున్ని జిల్లా ఆస్పత్రిలో పూజారాం చేర్చారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. వారు వచ్చిన అంబులెన్స్ అప్పటికే తిరిగి వెళ్లిపోయింది.
కుమారుడి మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్ ఇప్పించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. కానీ అంబులెన్స్ లేదంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో పూజారాం తన కుమారుడి శవాన్ని తన భుజంపై వేసుకుని తన పెద్ద కుమారుడు గుల్షన్(8)తో కలిసి బయటకు వచ్చేశాడు.
తాను వాహనం తీసుకు వస్తానని చెప్పి పెద్ద కుమారుడి పక్కకు చిన్న కుమారుడి మృతదేహాన్ని పెట్టి వెళ్లాడు. ఇలా సుమారు గంటకు పైగా గుల్షన్ తన తండ్రి కోసం ఎదురు చూశాడు. విషయం తెలుసుకున్న కోట్వాలి టీఐ యోగేంద్ర సింగ్ వారి దగ్గరికి చేరుకున్నాడు.
ఆ బాలుడి మృత దేహాన్ని తీసుకుని యోగేంద్ర సింగ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు మృత దేహాన్ని తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పడు ఆ వైద్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.