మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ పరీక్షలో అడిగిన ప్రశ్న వివాదాస్పదం అయింది. దీంతో పేపర్ తయారు చేసిన వారిలో ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులను సర్వీస్ కమిషన్ బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో పాటు పరీక్షాపత్రం పై విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే…. రాష్ట్ర సివిల్ సర్విసెస్ పోస్టులకు మద్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరిక్షను మంగళవారం నిర్వహించింది. ఆ పరీక్షలో కశ్మీర్ కు సంబందించి విద్యార్థులను ఓ ప్రశ్న అడిగారు.
భారత్ ను, భారత సంపదను కాపాడాలంటే కశ్మీర్ ను పాక్ కు అప్పగించాలా? అని ప్రశ్న అడిగారు. పరీక్ష అనంతరం ఆ పరీక్షా పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నెటిజన్లు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు.
ఆ ప్రశ్నకు సమాధానం బీ అనే ఆప్షన్ లో పెట్టారు. కశ్మీర్ ను పాక్ అప్పగించ కూడదు అలా చేస్తే విభజన వాదాన్ని సమర్థించినట్టు అవుతుందనే సమాధాన్ని సరైనదిగా కీ పేపర్ లో పేర్కొన్నారు. కశ్మీర్ ను పాక్ కు ఇవ్వకూడదనే ప్రశ్నకు సమాధానాల్లో తెలియ జేశామని సర్దిచెప్పే ప్రయత్నాన్ని అధికారులు చేశారు.
అధికారుల తీరుపై రాజకీయనేతలు మండిపడుతున్నారు. అందులో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ అభ్యంతరకరమైనవేనని వారు తెలిపారు. కశ్మీర్ ను పాక్ కు అప్పగించాలని ఆలోచించడమే అభ్యంతరకరమన్నారు. వివాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత అజయ్ డిమాండ్ చేశారు.