మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కమల్ నాథ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా విశ్వాస పరీక్షలో ఓడిపోతామని తెలిసి ముందుగానే రాజీనామా చేశారు. కమల్ నాథ్ రాజీనామాతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. బీజేపీ ‘‘ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తుందని‘‘ కమల్ నాథ్ విమర్శించారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ కుట్రలు పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు 16 మందితో కలిపి ప్రభుత్వానికి మద్దుతు నిచ్చిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు స్పీకర్ కు అందజేశారు.
అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఇటీవలనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజీనామ చేసిన ఎమెల్యేలందరూ ఆయన అనుచరులే. వారిని తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు హోటల్ లో ఉండడం..కాంగ్రెస్ సీనియర్లకు కాంటాక్ట్ లో లేకపోవడంతో వారిని కలవడానికి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్షలో మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలను లెక్కచేయని ముఖ్యమంత్రి కమల్ నాథ్.. కరోనా కారణంగా విశ్వాస పరీక్షను వాయిదా వేశారు. అయితే బీజేపీ ఈ విషయంపై సుప్రీంకోర్టు నాశ్రయించడతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని కాంగ్రెస్ ను ఆదేశించింది. మెజార్టీ లేదని తెలియడంతో ముందుగానే కమల్ నాథ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కమల్ నాథ్…రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాధిత్య సింధియా పై కూడా విమర్శలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే కారణంతో కాంగ్రెస్ ను పతనం చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్యాలెస్ (రాజప్రాసాదం) దగ్గరకు తీసుకెళ్లాలనుకోలేదని…ప్యాలెసే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు రావాలనుకున్నానని అన్నారు.
22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 206 కు పడిపోయింది. దీనిలో అధికార కాంగ్రెస్ సభ్యులు 92 మంది వారికి మద్దతు నిచ్చే మిత్ర పక్షాలు 7 గురు ఉన్నారు. సాధారణ మెజార్టీ 104 కు ఐదుగురు సభ్యులు తక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో మెజార్టీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించనున్నారు