వివాహితను లైంగికంగా వేధించిన వ్యక్తి కేసులో మధ్యప్రదేశ్‌లో ఓ కోర్టు వెరైటీ తీర్పునిచ్చింది. రక్షా బంధన్ సందర్భంగా బాధితురాలి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకొని.. బదులుగా 11 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చి ఆశీర్వాదం పొందాలని నిందితుడిని ఆదేశించింది. ఈ ఘటన రాజధాని ఇండోర్‌లో జరిగింది.
ఉజ్జయినికి చెందిన విక్రమ్ బాగ్రి ఇటీవల ఓ వివాహితను వేధించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో అతన్ని జైలుకు పంపించారు. నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు షాక్ ఇచ్చింది.
రక్షాబంధన్ రోజు ఉదయం 11 గంటలకు స్వీట్ బాక్స్ తీసుకొని నిందితుడు తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాలని ఆదేశించింది. బాధితురాలితో రాఖీ కట్టించుకొని భవిష్యత్తులో రక్షణగా ఉంటానని వాగ్ధానం చేయాలని.. అలాగే రాఖీ కట్టినందుకు బహుమతిగా రూ.11వేలు కూడా ఇచ్చి ఆశీర్వాదం పొందాలని కోర్టు ఆర్డర్ వేసింది. అంతే కాదు బాధితురాలితో పాటు ఆమె కొడుకుకి కూడా రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొనివ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.