దేశంలో తాగునీటి సరఫరా లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని బిందెలతో తీసుకొస్తుంటారు ప్రజలు. అయితే.. గుక్కెడు నీటి కోసం కొన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లి తీసుకుని వస్తున్న భార్య కష్టాన్ని చూడలేని ఓ భర్త ఏకంగా కొండను తొలచి బావిని తవ్వాడు. దీని కోసం మూడేళ్ల పాటు శ్రమించాడు. గంగమ్మను భూమిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు.
మధ్యప్రదేశ్ లోని సిధీ జిల్లాలో జరిగింది సంఘటన. నీటి కోసం తన భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక సిహావల్ గ్రామానికి హరిసింగ్ భగీరథ ప్రయత్నం చేశాడు. ఏకంగా కొండపైనే బావిని తవ్వాడు. సిహావల్ గ్రామం రాజధానికి కేవలం 45 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 3 వేల జనాభా ఉన్న ఈ ఊరిని మంచి నీటి కొరత వేధిస్తోంది. నిత్యం మహిళలందరూ కిలోమీటర్ల మేర వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
హరిసింగ్ తన భార్య కోసం ఇంటి సమీపంలోనే ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. అది అంత సాధ్యమైన పని కాదు. ఎందుకంటే వారు ఉండేది కొండ ప్రాంతం. కొండను తవ్వినప్పటికీ నీళ్లు రావని గ్రామస్థులు అతడితో వాదిస్తూ ఉండేవారు. అయినా అతను పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. చివరకు అనుకున్నది సాధించాడు.
కుటుంబ సభ్యుల సాయంతో మూడేళ్లపాటు శ్రమించి.. 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతు బావిని తవ్వాడు హరిసింగ్. గంగమ్మ ఉప్పొంగి పైకి వచ్చింది. అయితే.. మరింత లోతుకు వెళ్తే గానీ సరిపడా నీళ్లు రావని తన పనిని ఇంకా కొనసాగిస్తానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఇతడి ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.