48 గంటల శ్రమ వృథా అయింది.. బోరుబావిలో నుంచి బటయకు తీసిన బాలుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన ఏడేళ్ల బాలుడిని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు 48 గంటల తర్వాత బయటికి తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేసిన వైద్యులు.. బాలుడు మరణించినట్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మంగళవారం జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో ఉదయం 11 గంటల సమయంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి ఓ కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసిన చిన్నారులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరిగెత్తారు.
ఈ క్రమంలో లోకేష్ కూడా ఎదురుగా ఉన్న పొలం వైపుగా పరిగెత్తుతూ.. ప్రమాదవశాత్తూ పొలంలో తెరచి ఉన్న 60 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. చిన్నారిని బయటకు తీసేందుకు ఆపరేషన్ ప్రారంభించింది.
జేసీబీ యంత్రాన్ని అమర్చడం ద్వారా బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నించారు. లోకేష్ పరిస్థితిని తెలుసుకోవడానికి కెమెరాను కూడా వినియోగించారు. ఎట్టకేలకు 48గంటల నిరీక్షణ తర్వాత తాజాగా ఆ బాలుడిని బయటకు తీసినా.. ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ బాలుడి మరణించినట్లు వైద్యులు తెలిపారు.