ఓ జంట గర్బా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కండోమ్ చూపుతున్నట్టుగా ఉన్న ఓ యాడ్ ఏ మతాన్నీ కించపరిచినట్టు కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్ లో గర్బా డ్యాన్స్ చాలా పాపులర్.. దేశంలో చాలాచోట్ల ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా యువతీ యువకులు కోలాటమాడుతూ.. గర్బా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే తన కండోమ్ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు మహేంద్ర త్రిపాఠీ అనే ఫార్మసిస్ట్ .. ఓ కపుల్ ఈ డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఫోటోను వాడుకున్నాడు.
కండోమ్ ఇమేజీతో కూడిన ఈ ఫోటో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేదిగా ఉందని హిందూ సంస్థకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాటు కోర్టుకెక్కాడు. ఈ ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు త్రిపాఠీపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు పెట్టారు. దీన్ని సవాలు చేస్తూ త్రిపాఠీ.. మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఏ మతాన్నీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని, కేవలం తన ప్రాడక్టును ప్రమోట్ చేసుకోవడానికే తాను యత్నించానని, అందువల్ల తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరాడు. ఈయన వాదనతో జస్టిస్ సత్యేంద్రకుమార్ సింగ్ నేతృత్వానగల బెంచ్ ఏకీభవిస్తూ.. ఈ నెల 19 న ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేసింది.
ఈ పిటిషనరే స్వయంగా హిందువని, తన ఐడెంటిటీని దాచి పెట్టకుండా ఈయన తన సొంత మొబైల్ నెంబరుతోనే దీన్ని పోస్ట్ చేశాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. తన సంస్థ ప్రాడక్టును ప్రమోట్ చేసుకోవడమే త్రిపాఠీ ఉద్దేశంగా కనిపిస్తోందని, ఏ మతపరమైన సెంటిమెంట్లను గాయపరచాలన్నది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి పాఠం నిన్న అందింది.