స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా దర్బార్. రజినీకాంత్ స్టేటస్ కు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వేల థియేటర్లలో దర్బార్ సినిమాని విడుదల చెయ్యనున్నారు చిత్ర నిర్మాతలు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక తో పాటు పలు దేశాల్లో కూడా దర్బార్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సమయంలో దర్బార్ చిత్రం రిలీజ్ కు మలేషియాలో అడ్డంకులు నెలకొన్నాయి.
మలేషియాలో తమిళులు ఎక్కువ. అందువల్ల ఆ దేశంలో దర్బార్ విడుదలకు భారీ ప్లాన్ చేశారు చిత్ర నిర్మాతలు. అయితే దర్బార్ సినిమా నిర్మించిన లైకా సంస్థ అంతకు ముందు రజినీకాంత్ తో రోబో 2 .o చిత్రాన్ని నిర్మించింది. ఆ సమయంలో మలేషియా సంస్థకు 23 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. ఆ విషయమే ఇప్పుడు తెర మీదకు వచ్చింది. పాత బకాయిలు చెల్లించి చిత్రాన్ని విడుదల చెయ్యాలంటూ సదరు సంస్థ తమిళనాడు హై కోర్ట్ ను ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాల్ని జారీ చేసింది. పిటిషన్ దారు పేర్కొన్నట్లుగా పాత బకాయిల్ని చెల్లించటమేకాదు.. తాజా చిత్ర విడుదల కోసం రూ.4.90 కోట్లు డిపాజిట్ చేయాలంటూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఒకవేళ.. అలా చేయని పక్షంలో దర్బార్ విడుదలకు అనుమతించమని స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ పై ఎన్ని అడ్డంకులు రావటంతో రజిని ఫాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.