ఢిల్లీలో భూకంపం సంభవించింది. దేశ రాజధానిలో సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీ దాని పొరుగు ప్రాంతాలతో పాటు ఉత్తర, తూర్పు భారత్‌లో పలు చోట్ల భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
భూకంప కేంద్రం నేపాల్ వద్ద ఉన్నట్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘడ్‌కు తూర్పున 148 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు చెప్పింది. నేపాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2.28 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు పేర్కొంది.
భూకంపానికి సంబంధించిన వీడియోలను ఢిల్లీ వాసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. భూకంప సమయంలో ఇండ్లలోని ఫ్యాన్లు, వస్తువులు కంపిస్తు వుండటం కనిపిస్తోంది. భూమి కంపించడంతో ప్రజలంతా భయంతో ఇంట్లో బయటకు పరుగులు తీశారు.
రోడ్లపై వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచి పోయారు. దేశ రాజధానిలో ఈ నెల 5న కూడా భూ కంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్ హిందు కుష్ పర్వత ప్రాంతంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. దాని ప్రభావం ఢిల్లీలో కూడా కనిపించినట్టు అధికారులు పేర్కొన్నారు.