మహారాష్ట్రలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. నూతన స్పీకర్ గా ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. మొదటి సారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన నార్వేకర్ స్పీకర్ గా ఎన్నిక కావడం విశేషం.
స్పీకర్ పదవి కోసం ఉద్దవ్ ఠాక్రే విధేయుడు రాజన్ సాల్వే, నార్వేకర్ లు పోటీ పడ్డారు. ఇందులో నార్వేకర్ కు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అజ్మీ, రాయిస్ షేక్ లు హెడ్ కౌంట్ సమయంలో సైలెంట్ గా ఉన్నారు. ఏఐఎంఐఎం ఎమ్మెల్యే సైతం ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేసినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు.
ఓటింగ్ అనంతరం రాహుల్ నార్వేకర్ ను విజేతగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సాల్వేకు అనుకూలంగా 107 ఓట్లు వచ్చినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. షిండే ప్రభుత్వం సోమవారం ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షలో తాము ఖచ్చితంగా గెలిచి తీరతామని షిండే వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.