మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ రాజీనామా ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. పేరుకు జిల్లా అధ్యక్షుడనే తప్ప.. మెుదటి నుంచి కూడా ఆయనపట్ల రాష్ట్ర నాయకత్వం, ఇతర సీనియర్ నేతలు వివక్ష ప్రదర్శిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మొన్నా మధ్య జిల్లా కమిటీని ప్రకటించిన నాయకత్వం.. అధ్యక్షుడిగా ఎర్రశేఖర్ పేరును మాత్రమే ప్రకటించి వదిలేసింది. మిగతా సభ్యుల నియామించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో వెంటవచ్చే నేతలెవరో తెలియక ఎర్ర శేఖర్ జిల్లాలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే మిగిలిన కమిటీని నియమించకుండా.. ఎర్ర శేఖర్‌ను రాష్ట్ర నాయకత్వం ఇబ్బంది పెడుతోందని పార్టీలో ఓ వర్గం అనుకుంటోంది.
ఇక తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన సందర్భంగానూ ఎర్రశేఖర్‌ను అవమానించినట్టుగా తెలుస్తోంది. బండి టూర్‌కు సంబంధించి మహబూబ్ నగర్‌లో ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించగా.. ఎలాంటి సమావేశం పెట్టొందంటూ ఎర్ర శేఖర్‌కు చెప్పినట్టుగా తెలిసింది. దీనికి తోడు బండి సంజయ్ జిల్లా పర్యటనకు రాగా.. ఎర్రశేఖర్ ఆయన వెంటే ఉన్నారు. అయితే ఈ క్రమంలో నేతలంతా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరయ్యారు.అయితే ముఖ్య నేతలు కూర్చున్న టేబుల్‌పై కాకుండా.. ఎర్రశేఖర్‌ను వెనక వరుసలో కూర్చోబెట్టడంతో ఆయన మనస్తాపం చెందారని తెలిసింది. ఇలా అడుగడుగున అవమానం ఎదురుకావడంతో…బండిసంజయ్ జిల్లా పర్యటనలో ఉండగానే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. కాగా ఎర్రశేఖర్… పాలమూరు జిల్లాలోనే బలంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో .. ఆయన పార్టీని వీడటం పెద్ద దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.