తెలంగాణలో అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చాలా మంది లీడర్లు ప్రజా సేవను వదిలేసి.. భూకబ్జాలనే పనిగా పెట్టుకున్నారు. ఇటీవలే పలువురు ఎమ్మెల్యేల భూబాగోతాలు కథలు కథలుగా బయటపడగా.. చోటామోటా లీడర్లు కూడా వారినే ఫాలో అవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో ఓ TRS లీడర్ తన భార్య కౌన్సిలర్ పదవిని అడ్డుపెట్టుకొని.. భారీ స్కామ్‌కు తెరతీశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమికి తానే స్వయంగా పట్టాలిస్తూ.. ఎమ్మార్వో అవతారమెత్తారు. ఇదే విషయమై మరో కౌన్సిలర్ మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడంతో.. ఈ దందా బయటపడింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలోని పదవ వార్డులో 523 సర్వే నెంబర్‌పై కొంత ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ స్థలంలో కొందరు పేదవాళ్లు ఇళ్లు కట్టుకునేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదన్న కారణంతో అధికారులు వాటిని కూల్చేశారు. దీంతో వారు స్థానిక వార్డు( పదవ వార్డు) కౌన్సిలర్ రాణి.. భర్త అయిన రాజును ఆశ్రయించారు. అప్పుడే ఆయన మదిలో ఓ కన్నింగ్ ఆలోచన తట్టింది. సెక్యురిటి గార్డుగా పనిచేసే మరో వ్యక్తి సాయంతో… 523 సర్వేలోని భూములకు నకిలీ పట్టాలు సృష్టించడం మొదలుపెట్టారు. వంద గజాలకు 3-4 లక్షల రూపాయలు, రెండు వందల గజాల స్థలాన్ని రూ.5- 7 లక్షల వరకు వసూలు చేసి.. వారి పేరిట పట్టా పత్రాలను తయారు చేసి విక్రయించారు.. పైగా ఒకే పట్టాను ముగ్గురు, నలుగురికి ఇచ్చారు. పైగా ఎవరికీ అనుమానం రాకుండా.. గతంలో పనిచేసిన తహసిల్దార్ల సంతకాలు, ముద్రలను ఫోర్జరీ చేశారు.
కౌన్సిలర్ భర్త నిర్వాకం ప్రభుత్వం వద్దకు చేరడంతో… ఆమెను సస్పెండ్ చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా సమాచారం.