వారం రోజులుగా పాలమూరులో జరుగుతున్నకిడ్నాప్,అరెస్టుల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఓ హత్యాయత్నం కేసులో నాగరాజు,యాదయ్య, విశ్వనాథ్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..రిమాండ్ రిపోర్టులో హత్యాయత్నం జరిగినట్లు పేర్కొన్న రోజు కంటే ముందే వీరంతా కిడ్నాప్ నకు గురయ్యారని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ముందే కిడ్నాప్ అయినవారు హత్యాయత్నం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.ఓ కట్టుకథ చెప్పి అక్రమ కేసులో ఇరికించారని అంటున్నారు.
పాలకులు చేసే తప్పులను ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా అని నిలదీస్తున్నారు బాధితుల కుటుంబసభ్యులు.దేశం మొత్తం సంతోషంగా శివరాత్రి సంబరాలు చేసుకుంటుంటే..తాము మాత్రం రోడ్లపైకి వచ్చిన్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని తొలివెలుగుతో వాపోయారు.
మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలోని బహిరంగ ప్రదేశంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు.పట్టణంలో రామరాజ్యం లేదని..రావణ రాజ్యం కొనసాగుతోందని వాపోయారు.తమ గోడును మీడియా చూపించడం లేదని..తొలివెలుగు మాత్రం పోరాడుతోందని తెలిపారు.
తమవారిపై ఎలాంటి కక్ష కొనసాగిస్తున్నారో అందరికీ తెలిసేందుకే ఇలా రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు బాధితుల కుటుంబసభ్యులు.తమవారు ఎలా ఉన్నారో..వారిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని నాగరాజు,యాదయ్య భార్యలు కవిత,నాగమణి కన్నీటి పర్యంతమయ్యారు.బోరున విలపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
అరెస్ట్ అయినవారిని కుటుంబసభ్యులు కలవనివ్వకుండా చేస్తున్నారని అన్నారు ప్రముఖ న్యాయవాది వెంకటేష్.బాధితుల పక్షాన ఆయన కూడా అక్కడకు వచ్చారు.కిడ్నాప్,అరెస్ట్ అయినవారిలో ఎవరికైనా ఏదైనా జరిగితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.పోలీసుల అదుపులో ఉన్న మరికొందరిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.