మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామాతో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేపిన ఎర్రశేఖర్ ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు తిరిగి ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన సమయంలో.. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి ఎర్రశేఖర్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన నొచ్చుకున్నట్టు ప్రచారం జరిగింది. అనివార్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేసినప్పటికీ.. సంజయ్ పర్యటనలో జరిగిన పరిణామాలు ఆయన్ను బాధించాయని వార్తలు వచ్చాయి.
విషయం తెలిసిన బండి సంజయ్.. తన పర్యటన ముగిశాక ఎర్ర శేఖర్‌కు ఫోన్ చేసి నచ్చజెప్పారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీలో యధావిధిగా కొనసాగుతున్నట్లు మళ్లీ ప్రకటనను విడుదల చేశారు. మనస్తాపం చెంది జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని.. అయితే రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు లేఖలో తెలిపారు.