మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వలన తమ భూములను కోల్పోతున్నామంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు బాధిత రైతులు తొలివెలుగు ముంగిట తమ గోడెళ్లబోసుకున్నారు.
మూడు తరాలుగా సాగు చేసుకుంటూ వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను లాక్కుంటే తమ బతుకులు రోడ్డున పడతాయని కంట నీరు పెట్టుకున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియలో భాగంగా భూములను కోల్పోతున్న బాధిత రైతులకు 100 గజాల ప్లాట్లు ఇచ్చి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎంతో విలువైన నాలుగు ఎకరాల భూమిని లాక్కొని.. దేనికి పనికిరాని ప్లాట్లను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ అధికారులు గుర్తించిన 4 ఎకరాల భూమిలో ఎర్ర జెండాలను పాతారు రైతులు. తాతల కాలం నుండి వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నామని తెలిపారు. ఈ భూమి పోతే తమకు చావే దిక్కు అవుతోందంటున్నారు బాధితులు. తమ ప్రాణాలు పోయినా.. తమ భూములను మాత్రం వదులుకోమని అంటున్నారు రైతులు.