– పాలమూరు కిడ్నాప్ ఇష్యూలో కొత్త ట్విస్ట్
– తొలివెలుగు దెబ్బకు..
– తెరపైకి హత్యాయత్నం కేసు
– ఎట్టకేలకు కనిపించకుండా పోయినవారి..
– వివరాలు చెప్పిన పోలీసులు
– రిమాండ్ కు ముగ్గురు.. ఒకరు పరారీ..!
– మంత్రి అఫిడవిట్ కేసును..
– తెరమరుగు చేసేందుకు చూశారా?
– బాధితుల్ని బెదిరించేందుకే కిడ్నాప్ చేశారా?
గులాబీ రాజ్యంలో తిమ్మిని బమ్మిని చేయడం ఎంత కామనో తెలిసిందేగా. తరచూ ఏదో ఒక విషయంలో ఇది రుజువు అవుతూనే ఉంటుంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇందులో పెద్ద దిట్ట అనే పేరుంది. మరి.. ఆయన పార్టీ నాయకులు ఏమన్నా తక్కువా? అధినేత మార్గమే వారికి ఇన్స్పిరేషన్ కదా. అందుకే ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. జరగంది.. జరిగినట్టు.. కనికట్టు చేస్తూ జనాల్ని భ్రమల్లోనే ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వెలుగుచూసిన మహబూబ్ నగర్ కిడ్నాప్ ల క్రైమ్ కథ కూడా అంతేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం అమర్, అన్వర్, నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య, మధు అనే కొందరు వ్యక్తులు సడెన్ గా కనిపించకుండా పోయారు. పోలీసులు వారందరినీ ఎక్కడికో తీసుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్తున్నారో తెలియని అయోమయంలో వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో తొలివెలుగు ఎంటర్ అయింది. బాధితుల బాధను.. దీని వెనకున్న కుట్రను సవివరంగా ప్రజల ముందు పెట్టింది.
అమరేందర్ రాజు, మధు, రాఘవేంద్ర రాజు, నాగరాజు అన్నదమ్ములు. వీరిలో రాఘవేంద్ర రాజు.. విశ్వనాథ్ బండేకర్ అనే వ్యక్తితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై గతంలో కేసు పెట్టారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ పత్రాలతో నామినేషన్ వేశారని శ్రీనివాస్ గౌడ్ పై కోర్టులో కేసు వేశారు వీరిద్దరూ. ఆ కేసును వాపసు తీసుకోవాలని ఎన్నో రోజులుగా.. ఎన్నో రకాలుగా ఒత్తిడ్లు వచ్చాయి. కానీ.. వారిద్దరూ వెనుకడుగు వేయలేదు. కోర్టులో కేసు వ్యవహారం దగ్గర పడుతోంది.. ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహరంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈక్రమంలో రాఘవేంద్ర రాజు తమ్ముడు నాగరాజు కిడ్నాప్ నకు గురయ్యాడు. అదేరోజు రాత్రి రాఘవేంద్రరాజు ఇంటిపైకి వెళ్లిన పోలీసులు డోర్ ను ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అతనికి ముందస్తు సమాచారం అందడంతో వారి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అమర్, అన్వర్, యాదయ్య, విశ్వనాథ్ కనిపించకుండా పోయారు. వారందరినీ పోలీసులు ఎక్కడకు తీసుకెళ్లారో ఎటువంటి సమాచారం లేదు. దీంతో తొలివెలుగు ఈ ఇష్యూని హైలెట్ చేస్తూ వరుస కథనాలు ఇచ్చింది. బాధిత కుటుంబాల బాధను అందరికీ తెలిసేలా చేసింది.
సీన్ కట్ చేస్తే..
కనిపించకుండా పోయినవారిపై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇన్నాళ్లు కిడ్నాప్ పై నోరు మెదపని పోలీసులు.. తొలివెలుగు ఎంట్రీ తర్వాత ఎట్టకేలకు ఎత్తుకెళ్లిన వారిని రిమాండ్ కు తరలించారు. మహబూబ్ నగర్ కు చెందిన బంగారం వ్యాపారి గులాం హైదర్, మహమ్మద్ ఫారుఖ్ అనే వ్యక్తిని చంపేందుకు వీరంతా ప్రయత్నించారనేది పోలీసుల వెర్షన్. ఏ1 నిందితుడిగా చలవగాలి రాఘవేంద్ర రాజుని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఏ2గా అతని తమ్ముడు నాగరాజును, ఏ3గా విశ్వనాథ్ ను, ఏ4గా వరద యాదయ్యపై కేసు ఫైల్ అయింది. మారణాయుధాలు కలిగి ఉన్నారని పేట్ బషీరాబాద్ లో కేసు నమోదైంది. క్రైం నెంబర్ 146/2022, సెక్షన్ 120(బీ), 307, 115, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ ను రిమాండ్ చేశారు. రాఘవేంద్ర రాజు పరారీలో ఉన్నాడు.
ఫారుఖ్ ఫిర్యాదు మేరకు వీరందనీ కుటుంబసభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా తీసుకెళ్లారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అన్వర్, అమర్ మీద కేసు ఫైల్ కాలేదు. కానీ.. వారిని కిడ్నాప్ చేశారు. కారణం.. ఈ కేసు తొలివెలుగు ఎంట్రీ తర్వాతే తెరపైకి వచ్చిందని అంటున్నారు బాధితుల కుటుంబసభ్యులు. ఎందుకంటే.. మంత్రి అఫిడవిట్ విషయంలో త్వరలో ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఆ కేసు విషయంలోనే వీరందరినీ బెదిరింపులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్ వ్యవహారం నడించిందని.. తొలివెలుగు దీనిపై దృష్టి పెట్టి అన్ని విషయాలను ప్రజలకు చెబుతుండడంతో హత్యాయత్నం కేసును తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.