సామాన్యంగా బ్యాంకులో లోన్ లు ఎందుకు పెట్టుకుంటారు..? ఇల్లు కట్టుకునేందుకో, కార్లు కొనేందుకో, వ్యాపారం చేసేందుకో పెట్టుకుంటారు. ఇక్కడ ఓ రైతు కూడా అలాగే వ్యాపారం పెట్టుకుంటానని, అందుకు లోన్ కావాలని బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ వ్యాపారం ఏంటో, అతను అడిగిన లోన్ విలువ తెలిసి బ్యాంకు సిబ్బంది సైతం నోళ్లు వెళ్లబెట్టారు. ఇంతకీ ఆ రైతు ఇచ్చిన ఆప్లికేషన్ లో ఏముందో..? ఏంటో తెలుసుకుందామా..?
మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.. ఓ వినూత్నమైన వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. దానికి గానూ బ్యాంకు సిబ్బంది నుంచి ఆరు కోట్ల రుణం కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. రైతు ఏకంగా ఆరు కోట్లు ఎందుకు కావాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్న సిబ్బంది.. ఆ రైతును అసలు మీరు ఏ వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారు అని అడగగా ఓ హెలికాప్టర్ కొని దానిని కిరాయికి తిప్పుతాను అని చెప్పాడు. అంతే దెబ్బకు బ్యాంకు అధికారులకి దిమ్మ తిరిగింది.
హింగోలీకి చెందిన 22 ఏళ్ల రైతు కైలాస్ పతంగే.. ఆరు కోట్ల రుణం ఇవ్వాలని గోరేగావ్ లోని ఓ బ్యాంకులో ఆప్లికేషన్ ఇచ్చాడు. ఆ డబ్బుతో హెలికాఫ్టర్ కొని, దాన్నికిరాయికి నడపనున్నట్లు రైతు తెలిపాడు. వ్యవసాయం కోసం ఖర్చు చేయలేకపోతున్నట్లు ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పతంగేకు రెండు ఎకరాల భూమి ఉంది. అయితే వర్షం సరిగా లేని కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. గడిచిన రెండేళ్ల నుంచి సోయాబీన్ ను పండించాననీ, కానీ ఆ పంట వల్ల లాభాలు లేవని పంట బీమా నుంచి వచ్చిన డబ్బు కూడా సరిపోలేదని ఆ రైతు తెలిపాడు. వ్యవసాయం భారంగా మారడం వల్లే హెలికాప్టర్ కొనాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు.
మంచి జీవనం కొనసాగించాలంటే దాన్ని రెంట్ కు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
కేవలం పెద్దవారికే పెద్ద కలలు ఎందుకు ఉండాలి. రైతులు కూడా పెద్ద కలలు కనాలని, హెలికాప్టర్ కొనేందుకు ఆరున్నర కోట్ల రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నానని, మిగతా వ్యాపారాల్లో చాలా పోటీ ఉందని, అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు ఆ రైతు వివరించాడు.