మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో ‘మహాకాల్ లోక్ కారిడార్’ పేరిట నిర్వహించే మెగా ఈవెంట్ ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని 40 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మహాకాళేశ్వర్ టెంపుల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరిట చేపట్టిన ఈ తొలిదశ పనుల వ్యయం రూ. 856 కోట్లు. ఉజ్జయినిలో టూరిజం అభివృద్ధికి ఇదెంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు. పరమశివుడి భక్తులందరినీ కనెక్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని 40 దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని అన్ని ప్రముఖ శివాలయాలను వేలాది లాంతర్లతో అలంకరిస్తారని పేర్కొన్నాయి.
రాష్ట్రంలోని ఈ ప్రాజెక్టును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ , ఆ తరువాత 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఈ ప్రాజెక్టు కారణంగా పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టును పురస్కరించుకుని తాము అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, న్యూజిలాండ్ వంటి వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలతో ఫోన్ లో మాట్లాడామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్త శర్మ తెలిపారు.
తమ పార్టీకి చెందిన ఎన్నారై విభాగం అప్పుడే ఇందుకు కృషి చేసిందన్నారు. తాను, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వర్చ్యువల్ గా వారితో సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రధాని మోడీ ఈ మెగా ఈవెంట్ ని ప్రారంభించనుండడం తమ అదృష్టమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి భారీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మోడీ రాక సందర్భంగా ఉజ్జయినిని అందంగా తీర్చిదిద్దినట్టు వెల్లడించాయి.