యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ఈ నెల 28న జరగనుంది. అనంతరం ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనాలు మొదలవుతాయని ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పూర్వాంగభూతంగా ఈ నెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం నిర్వహించనున్నట్టు తెలిపారు. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో క్రతువును నిర్వహిస్తున్నట్లు ఈవో చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్టు వెల్లడించారు. ఆలయ గోపురాల కలశాల అన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తియ్యాయని స్ఫష్టం చేశారు.
21 నుంచి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం బాలాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. 28న సంప్రోక్షణ తర్వాత బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రదానాలయంలోకి తరలిస్తారని వివరించారు. ఆ రోజు పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆమె చెప్పారు. ఆలయ ఉద్ఘాటనకు అందరూ ఆహ్వానితులేనని ఈవో తెలిపారు.
యాదాద్రి కొండ కింద నిర్మించిన దీక్షాపరుల మండపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో పేర్కొన్నారు. కల్యాణ కట్ట, పుష్కరిణిలు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. దేవాదాయ శాఖ , జిల్లా యంత్రాంగం, ఇతర అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బాలాలయంలో యాగశాల ఏర్పాట్లు శనివారంతో పూర్తవుతాయని చెప్పారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడుకి జియో ట్యాగింగ్ చేయనున్నట్లు ఈవో తెలిపారు.