ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం పుణ్యక్షేత్రం కావడంతో పంచ నారసింహ క్షేత్రంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. ఏడేళ్ల క్రితం చేపట్టిన ఘనమైన దీక్ష నేడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి ఈనెల 28 వరకు యజ్ఞయాగాదులతో యాదాద్రి మార్మోగనుంది. ఆగమశాస్త్రానుసారం పంచకుండాత్మక మహాయాగానికి సోమవారం అంకురార్పణ జరిపారు. తొలిరోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలు జరిపారు.
సాయంత్రం బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహించిన తర్వాత.. మృత్సగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతిష్టాపన పర్వం ఘనంగా నిర్వహించారు.
మొదటిరోజు స్వస్తివాచనంతో ప్రారంభమైన యాగం.. ఏడురోజుల పాటు 108 మంది పండితుల చేతుల మీదుగా క్రతువును నిర్వహిస్తారు. అందులో భాగంగా స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.