మహారాష్ట్రలో జరిగిన రోడ్డుప్రమాదంతో నాలుగేళ్ల చిన్నారి అనాధగా మారింది. ఎంతో సంతోషంగా కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వెళ్తున్న వాహనాన్ని.. లారీ రూపంలో మృత్యువు కబళించడంతో నా అనేవాళ్లు ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాయగడ్ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు.
వ్యాన్ లో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అందరూ కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్ కు వెళ్తున్నారు. అయితే.. ముంబై వెళ్తున్న లారీ.. వేగంగా వచ్చి వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లోని ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలిక మరణించారు. మరో నాలుగేళ్ల బాలికకు గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.