మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఫేస్ బుక్ లైవ్ లో తీవ్ర నిరాశతో మాట్లాడిన ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఉద్ధవ్ ఆశించారు. కానీ.. ఎదురుదెబ్బే తగిలింది. బలపరీక్షపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. గవర్నర్ నిర్ణయాన్నే బలపరుస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఫ్లోర్ టెస్ట్ పిటిషన్ పై మూడున్నర గంటలపాటు వాడీవేడి వాదనలు జరిగాయి. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. అయితే.. చివరకు సుప్రీం గవర్నర్ నిర్ణయాన్నే సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉద్ధవ్ ఠాక్రే చేసేది లేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బలపరీక్షకు ముందే ఓటమిని అంగీకరించేశారు. బలపరీక్ష విషయంలో తమ అభ్యర్థనను సుప్రీం తిరస్కరించిందని తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు ఠాక్రే. ఔరంగాబాద్ పేరును అధికారికంగా శంభాజీ నగర్ గా మార్చడం.. ఉస్మానాబాద్ ను ధారాశివ్ గా మార్చడం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.
ఈ పట్టణాలకు కొత్త పేర్లను ఇంతకుముందు ఉద్దవ్ తండ్రి బాల్ ఠాక్రే పెట్టగా ఇప్పుడు వాటికి అధికారికంగా ఆమోద ముద్ర పడింది. మరోవైపు ఉద్దవ్ రాజీనామా ప్రకటనతో బీజేపీ నేతలు స్వీట్లు పంచుకున్నారు.