మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పై దాడి జరిగే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆయనకు భద్రతను మరింతగా పెంచారు. . బెదిరింపు సమాచారం అందిన మాట నిజమేనని రాష్ట్ర ఇంటలిజెన్స్ కమిషనర్ అశుతోష్ డుమ్రే ధృవీకరించారు.శనివారం సాయంత్రం ఈ సమాచారం అందిందని, దీంతో ఆయనకు ఇప్పుడున్న భద్రతకు మించి మరింత సెక్యూరిటీ కల్పించామని ఆయన చెప్పారు. హాని తలపెడతామంటూ ఇలా ఆయనకు బెదిరింపు లేఖ అందడం రెండో సారని అశుతోష్ చెప్పారు. లోగడ మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ అందిందని అన్నారు.
అయితే తాజాగా అందిన బెదిరింపు లేఖ గురించి మీడియా.. షిండే వద్ద ప్రస్తావించగా.. ఇలాంటివాటికి తాను స్పందించబోనన్నారు. తన హోమ్ శాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విధమైన సమస్యలను చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. నేనిలాంటి బెదిరింపులకు భయపడను.. ప్రజల సంక్షేమం కోసం పని చేసే నన్నెవరూ ఆపలేరు అన్నారాయన. వారికోసం పని చేస్తూనే ఉంటానన్నారు.
ఇప్పటికే షిండేకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అయినప్పటికీ ముంబైలోని ఆయన అధికారిక నివాసం వద్ద, థానే లోని ఆయన ఇంటివద్ద సెక్యూరిటీని మరింత పెంచారు.
దసరా సందర్భంగా ఈ నెల 5 న షిండే ముంబైలోని ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్ లో భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా-తాజా పరిణామం నేపథ్యంలో మద్యం తాగి ఉన్న ఓ వ్యక్తి.ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షిండేని హతమార్చేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆ వ్యక్తి లోనావాలా నుంచి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే అతడిని పోలీసులు ఆ తరువాత వదిలేశారు. .