మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సీరియస్‌గా స్పందించారు. తాను మౌనంగా ఉండటానికి కారణం తన దగ్గర సమాధానాలు లేక మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. మహారాష్ట్రను కించపరిచే కుట్ర జరుగుతోందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. కొందరు వ్యక్తులు కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిందని చెప్పి.. అప్పుడు రాజకీయాలు మొదలుపెట్టారని పరోక్షంగా బీజేపీనుద్దేశించి మండిపడ్డారు. సమయం వచ్చినపుడు సీఎం ప్రోటోకాల్‌ను పక్కనెట్టి మరీ మాట్లాడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 15 నుంచి నా కుటుంబం – నా బాధ్యత పేరుతో కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. వైద్యసిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వారి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఉద్ధవ్ కోరారు.