మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజు కేసులు పెరగడమే తప్ప.. తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మళ్లీ 25 వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,681 కేసులు వెలుగుచూశాయి. ఇక కరోనా కారణంగా నిన్న మరో 70 మంది మృతి చెందారు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితులు 24,22,021కు చేరారు. మరణాలు 53, 208కి పెరిగాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో లక్షా 77 వేల 560 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు ఉధృతి కారణంగా ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం.. మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. లాక్‌డౌన్‌ను ఒక ఆప్షన్‌గా చూస్తున్నట్టు స్పష్టం చేశారు. గతంలో కరోనా విజృంభించిన సమయంలోలానే ప్రజలు కరోనా నిబంధనలు కఠినంగా పాటించి.. వైరస్ నియంత్రణకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు, ఆడిటోరియాలు, ప్రైవేటు ఆఫీసులపై పలు ఆంక్షలు విధించింది. ఇకనుంచి 50శాతం సామర్థ్యంతోనే కార్యకలాపాలు కొనసాగించాలని సూచించింది.