తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో మహారాష్ట్రలోని ఓ గర్ల్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ తాము ప్రేమ పెళ్లి చేసుకోబోమని ప్రతిజ్ఙ చేశారు. చండూరు (రైల్వే) లోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ కి చెందిన విద్యార్ధినులు ”నాకు నా తల్లిదండ్రులపై పూర్తి విశ్వాసం ఉందని ప్రమాణం చేస్తున్నాను..నేను ఎవ్వరిని ప్రేమించను…ప్రేమ వ్యవహారాలు నడపను…ప్రేమ పెళ్లి చేసుకోను ” అని ప్రమాణం చేశారు. అంతే కాదు కట్నం తీసుకునే వారిని కూడా పెళ్లి చేసుకోమని ప్రతిజ్ఞ చేశారు.
”మేము ఎవరినైతే ప్రేమిస్తున్నామో అతను మమ్మల్ని మంచిగా చూసుకోవాలి…తన కాళ్లపై తాను నిలబడాలి…ప్రేమ విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది” అన్నారు రితిక అనే స్టూడెంట్. అసలు ప్రేమ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? మా తల్లిదండ్రులు ఈ విషయంలో బాగానే చూస్తారు…మా కు సరైన వాళ్లనే చూస్తారు అని మరో అమ్మాయి భావన చెప్పారు. ఈ సంఘటనపై మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ..విద్యార్ధులు తీసుకున్న నిర్ణయం మంచిదేనన్నారు. వార్ధా లాంటి సంఘటనలతో అప్రమత్తమై ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్పారు. వార్దాలో 24 ఏళ్ల ఓ లెక్చరర్ ను ప్రేమించిన వాడే సజీవ దహనం చేశాడు. ఫిబ్రవరి 3న జరిగిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.