మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కి ఓ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. మరో కేసులో ఆయనకు జైలు జీవితం తప్పలేదు. ఈడీ కేసులో ఆయనకు లక్ష రూపాయల పూచీకత్తుపై బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ లభించకపోవడంతో జైల్లోనే గడపవలసి వస్తోంది. గత ఏడాది నవంబరులో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఆరంభంలో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా స్పెషల్ కోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ అనిల్ దేశ్ ముఖ్ బాంబేహైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఆరు నెలలుగా ఆయన కేసు పెండింగులో ఉందని, అందువల్ల త్వరగా దీన్ని తేల్చాలని లోగడ సుప్రీంకోర్టు .. బాంబేహైకోర్టును ఆదేశించింది. తమ క్లయింటు ఆరోగ్యం, ఆయన వయస్సును దృష్టిలోనుంచుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయాలనీ దేశ్ ముఖ్ తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, బెయిల్ ఇవ్వరాదని ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు.
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ .. దేశ్ ముఖ్ పై నాడు పలు ఆరోపణలు చేశారు. ముంబైలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు సేకరించి ఇవ్వాలని తమను ఆదేశించారని అప్పట్లో ఆయన ఆరోపించారు.
ఈ అవినీతి కేసును సిబీఐ విచారించింది. నగరంలోని బార్లు, హోటళ్ల నుంచి రూ. 4.7 కోట్ల మేర సేకరించి దేశ్ ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అక్రమ సొమ్మును ఆయన కుటుంబం నాగ పూర్ లోని తమ విద్యా సంస్థకు మళ్లించిందని తెలిపాయి, పైగా పోలీసు అధికారుల బదిలీల్లో దేశ్ ముఖ్, మరికొందరు అనుచిత జోక్యం చేసుకున్నారని సీబీఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మరి సీబీఐ తనపై పెట్టిన కేసులో దేశ్ ముఖ్ కి కోర్టు ఎప్పడు బెయిల్ మంజూరు చేస్తుందో చూడాలి.