ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా రక్తాన్ని అందివ్వాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీకాగా, వెంటనే అమల్లోకి వచ్చేశాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 74,408 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స తీసుకునే పేదలకు ఉచితంగా రక్తం అందివ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రజలంతా పెద్ద ఎత్తున సహకరించి తోటి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదలకు అండగా ఉండేందుకు సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని తెలిపింది.