మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. పోలీసుల సూచనతో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా భావిస్తున్న బెళగావికి ఇక మహారాష్ట్ర బస్సులు వెళ్ళబోవని ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. తమ బస్సులపై కర్ణాటకవాసులు దాడులను ఉధృతం చేసే అవకాశం ఉందని, అందువల్ల అక్కడికి వీటిని నడపరాదని పోలీసులు హెచ్చరించడంతో తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సంస్ధ అధికారులు బుధవారం తెలిపారు.
ఒకప్పుడు బెల్గామ్ గా వ్యవహరించిన బెళగావి ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి కారణమైంది. తమ ప్రయాణికుల భద్రత, తమ వాహనాల సెక్యూరిటీని పురస్కరించుకుని ఇకపై బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. నిన్న మహారాష్ట్ర నుంచి వచ్చిన సుమారు 6 ట్రక్కులపై ఈ జిల్లాలో కన్నడ రక్షణ వేదికకు చెందిన ఆందోళనకారులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అలాగే జిల్లా సమీపంలోని ఓ చోట మహారాష్ట్ర బస్సులపై రాళ్ళు విసిరారు.
ఇందుకు ప్రతీకారంగా పూణే వద్ద శివసేన కార్యకర్తలు .. కర్ణాటకకు చెందిన నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. సరిహద్దు వివాదంపై తాను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కర్ణాటక సీఎం బొమ్మైతో కూడా సంప్రదించానన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య బోర్డర్ వివాదాన్ని పరిష్కరించే యత్నంలో భాగంగా ఇద్దరు మంత్రులను బెళగావికి పంపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను బొమ్మై నిన్న తప్పు పడుతూ.. దీన్ని తాము ఎదుర్కొంటామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. 1956 లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. కర్ణాటక పరిధిలోని సుమారు 700 గ్రామాల్లో మరాఠీ భాష మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందువల్ల వాటిని తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే ఇందుకు కర్ణాటక సర్కార్ నిరాకరించడంతో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.