మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వస్తున్న రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణల కేసు మరో కీలక మలుపు తిరిగింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సుప్రీం కోర్టు గడపతొక్కారు. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తన బదిలీపై స్టే విధించాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇక హోంమంత్రి తాను చేసిన ఆరోపణకు సంబంధించిన దర్యాప్తుపై నిష్ఫక్షపాతమైన విచారణ జరిపించాలని కోరారు. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని లేదంటే.. వారు సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనిల్ దేశ్‌ముఖ్ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ వీడియోలను సేకరించాలని అందులో కోరారు.
ఇదిలా ఉంటే తమ పార్టీకి చెందిన మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వస్తున్న ఆరోపణలను ఎన్సీపీ చీఫ్ అధినేత శరద్ పవార్ ఖండించారు. పరమ్‌వీర్ సింగ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచిన కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజేను.. హోంమంత్రి కలిశారని చేస్తున్న ఆరోపణల్లోనూ ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.