మహారాష్ట్ర ప్రభుత్వం ఖైదీల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇక నుంచి ఖైదీలకు వ్యక్తిగత రుణాలు ఇవ్వనున్నారు. ఖైదీల కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఈ రుణాలను ఇవ్వనున్నారు.
ఈ పథకం కింద ఖైదీలకు మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు రూ. 50000 లవరకు రుణాలను ఇవ్వనుంది. ఈ మొత్తానికి సంవత్సరానికి 7శాతం వడ్డీని వసూలు చేయనుంది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట పూణేలోని ఎర్రవాడ జైలులో అమలు చేయనున్నారు.
ఇందులో భాగంగా మొదట 1055 మంది ఖైదీలకు రుణాలు అందించనున్నారు. ఈ రుణాలకు కేవలం ఆ ఖైదీని మాత్రమే ష్యూరిటీగా పరిగణించనున్నారు.
ఖైదీలకు అమలు చేస్తున్న శిక్షా కాలం, శిక్ష నుంచి ఉపశమనం, వయస్సు, ఏడాదికి పని దినాలు, ఖైదీ రోజు వారి వేతనం లాంటి అంశాలను పరిగణించి రుణాల పరిమితిని నిర్ణయించనున్నారు.
పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర హోం మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. ఖైదీలకు వారి జీవన ప్రమాణాలు, పునరావాసం మెరుగుపరిచే లక్ష్యంతో వారికి రుణం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవాదులకు రుసుము చెల్లించడానికి, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించడానికి వారి అవసరాలను తీర్చడానికి రుణం సహాయపడుతుంది, ”అని వాల్సే-పాటిల్ చెప్పారు.