మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. పరిస్థితి చూస్తుంటే ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్టు అటు రాజకీయ పండితులు, ఇటు శివసేన నేతలు చెబుతున్నారు.
శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై హింట్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాసన సభ రద్దు దిశగా పరిణామాలు సాగుతున్నాయని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
కేబినెట్ మంత్రి, శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు నేతలతో కలిసి నిన్న గుజరాత్ లోని సూరత్ హోటెల్ లో బస చేశారు. తాజాగా బుధవారం ఆ ఎమ్మెల్యేలంతా అసోం చేరుకున్నారు.
తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే అసోం చేరుకున్న కొద్ది నిముషాల తర్వాత సంజయ్ రౌత్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న వారితో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఫోన్ లో మాట్లాడారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.
బాల్ ఠాక్రే చూపించిన హిందుత్వ బాటలోనే ముందుకు సాగుతామని, వెనక్కి తగ్గేదేలేదని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతుంది.