మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఆసక్తికరంగా మలుపులు తీసుకుంటోంది. శివసేనలో తిరుగుబాటు చినికి చినికి గాలి వానగా మారింది. మహా వికాస్ అఘాడీ కూటమి చివరి అంచుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
శివసేనలో తిరుగుబాటు ముదిరిపోయింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఆయన కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారింది.
సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వెల్లడించారు. దీంతో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామాపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఠాక్రే కరోనాతో బాధపడుతున్నా..వర్చువల్‌గా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటు శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ శిండే కూటమిలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వారి శిబిరంలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కూలడం ఖాయమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈక్రమంలోనే అసెంబ్లీని రద్దు చేసి..ప్రజల్లోకి వెళ్లాలని శివసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.