మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ. రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.
శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఏక్ నాథ్ షిండే వర్గానికి కొంత గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు1 కి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
పార్టీల పిరాయింపులు, సభ్యుల అనర్హత, పార్టీల విలీనం వంటి అంశాలపై ఈ వ్యాజ్యాలు రాజ్యాంగ పరంగా అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది.
వీటిపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అన్ని పార్టీలు తమ సమస్యలపై వచ్చే బుధవారం (జులై 27) నాటికి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
పార్టీ నియమించిన విప్ స్థానంలో మరొకరిని విప్ గా అసెంబ్లీ స్పీకర్ గుర్తించడాన్ని ఠాక్రే తరఫున న్యాయవాది కపిల్ సిబల్ తప్పుపట్టారు. ఇది పదవ షెడ్యూల్ కు వ్యతిరేకమని ఆయన వాదించారు.
ఓ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి సదరు పార్టీకి దూరమైన వ్యక్తితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సరికాదని సిబల్ అన్నారు. సిబల్ వాదనను షిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తోసిపుచ్చారు.
‘ఓ నాయకుడు తాను ఉంటున్న పార్టీలో మెజారిటీ సంపాదించి, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా, ఆ పార్టీ నాయకుడినే ప్రశ్నిస్తే అది ఫిరాయింపు కిందకు రాదని వివరించారు. పార్టీలోని నేతలంతా కలిసి తమ నాయకుడిని ఎంచుకోవడంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలో సీజేఐ జోక్యం చేసుకున్నారు. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు అని అన్నారు. ఇందులో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఏర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత కొన్ని సమస్యలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని తనకు అనిపిస్తున్నట్టు చెప్పారు. దీనిపై అన్ని పక్షాలు వచ్చే బుధవారం లోగా అభిప్రాయాలు సమర్పించాలని ఆదేశించారు.