మహారాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి తప్పింది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఇప్పటికే ఆ రాష్ట్రం ఆందోళన చెందుతోంటే.. తాజాగా ఒక్కరోజులోనే కళ్లుబైర్లు కమ్మే స్థాయిలో జనం కరోనా మహమ్మారి బారినపడటం సంచలనం రేపుతోంది.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 23,179 కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా ఏకంగా 84 మంది ఒక్కరోజులోనే ప్రాణాలు కోల్పోయారు.తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23.70 లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య 53,080కు పెరిగింది. తాజా కేసుల్లో ఒక్క ముంబైలో రికార్డుస్థాయిలో 2,377 కరోనా కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,52,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకప్పుడు దేశమంతా కలిపి ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క మహారాష్ట్రలోనే అంత ప్రమాదకరంగా మారాయి.
మహారాష్ట్రలోనే కాదు గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో 2 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో 1122 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ లెక్కన చూస్తోంటే గురువారం(రేపు) ఉదయం కేంద్రం ఆరోగ్యశాఖ విడుదల చేసే హెల్త్ బులెటిన్‌లో కరోనా కేసులు 30 వేల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.