అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మరోసారి చిక్కుల్లో పడనున్నారు. ఆమెకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ ప్రదీప్ గహరాట్ తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చాక కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని కౌర్ దంపతులకు కోర్టు షరతులు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ నవనీత్ కౌర్ భర్త ఎమ్మెల్యే రవి ఈ కేసు విషయాన్ని మీడియాతో ఆదివారం మాట్లాడారని ఆయన తెలిపారు.
ఇది కోర్టు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కౌర్ దంపతులపై కోర్టు ధిక్కారం పిటిషన్ ను దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. వారి బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును కోరనున్నట్టు తెలిపారు.
తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఎమ్మెల్యే రవి అన్నారు. ఆస్పత్రిలో తనను చేర్చాలని ఆమె గత ఆరు రోజులుగా జైలు అధికారులను అభ్యర్థిస్తున్నారని కానీ వారు ఆ అభ్యర్థనను పట్టించుకోలేదని రవి పేర్కొన్నారు.