మహారాష్ట్ర రాష్ట్రంలో ‘హనుమాన్ చాలీసా’ చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం ‘మాతోశ్రీ’ ఎదుట తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్ చాలీసా చదువుతానని అమరావతి ఎంపీ నవనీత్ గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం నవనీత్ కౌర్ రాణా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.
సీఎం ఉద్ధవ్ థాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ‘హనుమాన్ చాలీసా’ పఠిస్తామని హెచ్చరించారు. దీంతో ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు ఉదయం భారీగా చేరుకున్నారు. 9 గంటలు దాటినా నవనీత్ కౌర్ రాకపోవడంతో.. ముంబైలోని ఆమె ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారవణం ఏర్పడింది.
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతోశ్రీకి చేరుకుని తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని మరోసారి తెగేసి చెప్పారు. తమపైకి సీఎం థాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని ఆరోపించారు. సీఎం సూచన మేరకు వారు దాడికి దిగారన్నారు. పోలీసులు తమను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో శాంతిస్థాపన కోసం హనుమాన్ జయంతి రోజు థాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని తాము కోరామని, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని రవి రాణా పేర్కొన్నారు. అయితే, నవనీత్ రాణా, ఆమె భర్త రాష్ట్రంలో శాంతి భద్రతలను సవాల్ చేస్తున్నారని, వారిని వెనకనుంచి ఎవరో నడిపిస్తున్నారని శివసేన నేత అనిల్ దేశాయ్ ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారని చెప్పారు.