దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, గోవా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి.
ఇక దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, మహారాష్ట్రకు పనుల మీద వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని భావించిన సర్కార్… ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఆ 5రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని సర్కారు నిర్ణయించింది. కేరళ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వచ్చే విమాన ప్రయాణికులు 72 గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా సమర్పిస్తేనే అనుమతించాలని నిర్ణయించింది. లేకుంటే విమానాశ్రయాల్లో కేరళ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు వారి ఖర్చుతోనే చేయిస్తారు. గుజరాత్, గోవా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. అలాగే మహారాష్ట్రకు వచ్చే రైలు ప్రయాణికులు కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అని రిపోర్టు సమర్పించాల్సి ఉంది. రిపోర్టు లేకుంటే రైల్వే స్టేషన్లలో థర్మల్ తనిఖీలు చేస్తారు. కరోనా లక్షణాలుంటే వారికి కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ అని తేలితే వారిని వారి ఖర్చుతోనే కొవిడ్ కేంద్రాలకు తరలించాలని సర్కారు నిర్ణయించింది.
అయితే, లాక్ డౌన్ ఎత్తివేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం… అంతరాష్ట్ర ప్రయాణాల మధ్య ఆంక్షలు వద్దు అని చెప్పంది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర మళ్లీ ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.