మహారాష్ట్ర లోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఏర్పడి మూడు నెలలైనా గడవక ముందే కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణతో ఇది బహిర్గతమైంది. పృధ్వీరాజ్ చవాన్ తో సహా మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో వారంతా అసంతృప్తకి గురయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అల్లుడు అజిత్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే లను కేబినెట్ లోకి తీసుకున్న సీఎం సీనియర్లను తీసుకోకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరాభవంగా భావిస్తున్నారు. పార్టీకి వీర విధేయులుగా ఉండే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చవాన్, నసీమ్ ఖాన్, ప్రణితి షిండే, సంగ్రామ్ తోప్టే, అమిన్ పటేల్, రోహిదాస్ పటేల్ సోమవారం సాయంత్రం పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. వారికి హైకమాండ్ ఏం చెప్పి బుజ్జగించింది..? వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కొద్ది రోజుల తర్వాత గాని తెలియదు.
ఇదిలా వుంటే మంత్రివర్గంలో స్థానం దక్కిన కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, దిలీప్ వాల్సే పాటిల్, ధనుంజయ్ ముండే, సునీల్ ఛత్రపాల్ కేదార్, కేసీ పడ్వి లకు ఇంకా పోర్ట్ పోలియోలు కేటాయించలేదు. వారికి రెండు మూడు రోజుల్లో శాఖలు కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శాఖలు కేటాయించిన తర్వాత కూడా వీరిలో అసంతృప్తులు మొదలయ్యే అవకాశం లేకపోలేదు.
మరో వైపు మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోవడంపై మనస్థాపానికి గురైన బీడ్ నియోజకవర్గ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి రాజీనామాకు సిద్ధమయ్యారు.తనకు రాజకీయాలు చేతకాదన్న ఆయన మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే పరిస్థితి ఇలా వుంటే కూటమి ఐదేళ్ల పాలన ఎలా సాగుతుందోనని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.