కరోనా పేషెంట్లను గుర్తించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొందరు పేషెంట్లు హాస్పిటల్స్, ఎయిర్ పోర్ట్ నుంచి తప్పించుకుంటుండడంతో వారి ఎడమ చేతికి హోం క్వారంటైన్ అని ముద్ర వేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో సమావేశమైన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేష్ తోప్ తెలిపారు. రాష్ట్రంలో 39 మంది కరోనా పేషెంట్లను నమోదయ్యాయని…ఏడుగురు అనుమానిత పేషెంట్లు ఏడు రోజుల క్రితం హాస్పిటల్, ఎయిర్ పోర్ట్ నుంచి తప్పించుకున్నారని మంత్రి తెలియజేశారు.
కరోనా పేషెంట్ ఎడమ అరచేతి వెనకాల ఇంక్ తో హోం క్వారంటైన్ అనే ముద్ర వేస్తారు. ఏ తేది వరకు ఐసోలేషన్ లో ఉండాలో ఆ తేదీని ముద్రిస్తారు. పోలింగ్ రోజు ఓటర్లకు ఓటు వేసినట్టుగా తెలియజేస్తూ వేలిపై గుర్తు పెట్టే ఇంక్ కావడంతో అది అంత తొందరగా చెరిగిపోదని మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఎవరైనా పేషెంట్ హోం క్వారంటైన్ నుంచి తప్పించుకుని ప్రజల్లో కలిసినా సులభంగా గుర్తిస్తారని చెప్పారు. ఎవరైన హోం క్వారంటైన్ నుంచి తప్పించుకున్నా…బయటకు వెళ్లినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.