పాదయాత్ర అంటే అది కాదు ఇది!

పలానన్ని వేల కిలోమీటర్లు నడిచి ప్రజల కష్ట నష్టాలను, జనం పడే ఈతిబాధల్ని చదివామని, ఇక నివారణ కోసం చట్టాలు చేసి ఉద్ధరించడం ఒక్కటే మిగిలిందని చెప్పుకునే సోకాల్డ్ రాజకీయ నాయకులకు మన దగ్గర కొరత లేదు. ఒకప్పుడు మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ భూదానోద్యమ కాలం నాటి ‘పాదయాత్రల’ పవిత్రతను మలినం పట్టించడంలో వర్తమాన పొలిటీషియన్లు పోటీపడుతున్న వైనాలే అన్నీ! పాదయాత్ర అంటే ఏమిటి.. ఎలా చేస్తే దాన్ని పాదయాత్ర అంటారో చేసిచూపెట్టాడు కడుపుమండిన మహారాష్ట్ర అన్నదాత.

50 వేల మందికి పైగా రైతన్నలు.. తమతమ ఊర్ల నుంచి కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా.. ఆకలి దప్పులతోనే రాజధాని బాట పట్టారు. అరికాళ్ళు రెండూ పుండ్లు పట్టి.. నెత్తురు కారుతున్నా లెక్క చేయకుండా రాత్రీపగలు తేడా లేకుండా ‘రైతు జాతి’ మొత్తం రాజధాని ముంబైకి దారితీసింది. పూర్తి స్థాయి రుణమాఫీ, పంటకు కనీస మద్దతు ధర,  స్వామినాధన్ కమిటీ సిఫార్సుల అమలు, ఆదివాసీ భూముల్ని రైతాంగానికి అంకితం చేయడం లాంటి డిమాండ్ల సాధన కోసం వీళ్ళు చేపట్టిన ఈ ఉద్యమం మొత్తం దేశం దృష్టిలో పడింది.

రైతు ఉనికి లేని ప్రాంతం ఎక్కడా ఉండదు కనుక జాతి మొత్తం వీళ్ళ కడుపుమంటను అర్థం చేసుకుంది. సానుభూతి కురిపిస్తోంది. వందలకొద్దీ మైళ్ళు నడిచి స్వచ్ఛంద పోరాటానికి దిగిన మహా రైతన్న మొరను ఈసారైనా ఆలకించాలని జనం కోరుతున్నారు.

ఐదు రోజుల పాటు కొనసాగిన 180 కిలోమీటర్ల పాదయాత్రకు అడుగడుగునా జనం తోడున్నారు. మంచినీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేసి రైతుల పట్ల పెద్ద మనసు చాటుకున్నారు. దేశంలోని అన్ని వర్గాలూ ఒక్కటై దగాపడ్డ రైతన్నకు బాసటగా నిలబడ్డాయి. ”కిసాన్ లాంగ్ మార్చ్’కి హ్యాష్ టాగ్ తగిలించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించింది కూడా. ప్రభుత్వాల్లో కదలిక రావాలన్న వీళ్ళ పొలికేక ఎంతమేర ఫలిస్తుందో చూడాలి. ఏదేమైనా.. ‘పాదయాత్ర’ ఒరిజినల్ ఫేస్ ని మళ్ళీ గుర్తు చేసిన మరాఠీ రైతన్నకు జోహార్లర్పించాల్సిందే!